MachilipatnamLocal News
March 11, 2026
మచిలీపట్నం

బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా

  • March 9, 2026
  • 1 min read
[addtoany]
బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా
– గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
– విద్య, వైద్యంతో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం
– జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మార్చారు
– మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర.
 
మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN:
 
 మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురం గ్రామంలో 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.60 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ భవనం, రూ.4.79 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి, ప్రహరీ, అంత్యక్రియలు నిర్వహణ భవనం వంటి సుమారు 40 పనులు, రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ఐదు అంగన్వాడీ భవనాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తో కలిసి ప్రారంభించారు. భారీ ర్యాలీగా వెళ్లి గ్రామీణ అభివృద్ధి పనుల్ని దగ్గరుండి పరిశీలించారు. పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పర్యవేక్షించారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సెంటర్ల నిర్మాణ నాణ్యతను పరిశీలించారు.
 
 అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2014-19 మధ్య అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారు. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో అభివృద్ధి ప్రారంభమైంది. సుమారు రూ.20 లక్షల వ్యయంతో పీహెచ్సీ నిర్మాణం చేయడం ద్వారా స్థానిక ప్రజలకు సత్వర వైద్య సదుపాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే తాళ్ల పాలెంలో మరో పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో రెండు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దపట్నం, గోకవరం, పోలాటి తిప్ప, అరిసెపాలెంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా రూ.1.80 కోట్ల వ్యయంతో నూతన పీహెచ్సీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
 
 ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పోలియో రహితంగా రాష్ట్రాన్ని మార్చామన్నారు. కేన్సర్ మహమ్మారిని శాశ్వతంగా సమాధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రధానంగా ఆడబిడ్డలు కేన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారని గుర్తించి రూ.4 వేల విలువైన వేక్సిన్‌ను బాలికలకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 
 
 రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వైద్యారోగ్యం కోసం బడ్జెట్లో రూ.18 వేల కోట్లు, విద్య కోసం రూ.22 వేల కోట్లు కేటాయించాం. ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్టరంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. 
 
 ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయంలో విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో అక్కడి నేల చౌడుబారిపోయింది. అదే సమయంలో రసాయనాల వినియోగం కారణంగా కేన్సర్ సహా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో ప్రతి రోజూ ఒక రైలు ఢిల్లీకి నడిచే పరిస్థితి వచ్చింది. ఆ దుస్థితి మనకు ఎదురవ్వకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా నేచురల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో.. మన ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చి ముందుకు వెళ్తోంది.
 
 మరోవైపు మచిలీపట్నం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాం. బందరు నుండి చిన్నాపురం వరకు ఉన్న రోడ్డును విస్తరించిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే. బ్రిడ్జి నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణం కోసం రూ.38 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఐదారు నెలల్లోనే పూర్తి చేసి చూపిస్తాం. ఇక్కడి పిల్లలకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా స్థానికంగా ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు కొంత భూమి కేటాయించే బాధ్యత స్థానిక నాయకత్వం తీసుకోవాలి. త్వరలోనే బందరు పోర్టు పూర్తి కాబోతోంది. ఈ ప్రాంత అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 
 
 కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ , మచిలీపట్నం రూరల్ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ , చిన్నాపురం సర్పంచి కాగిత గోపాల్ రావు , క్లస్టర్ ఇంఛార్జి తలారి సోమశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *