మచిలీపట్నం:
ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడి గ్రామాన్ని సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా తీర్చిదిద్దుటకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పెనమలూరు నుండి మచిలీపట్నం వస్తూ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడుతో కలసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఠాగూర్ సాంస్కృతిక సముదాయం పథకం కింద కూచిపూడి లో ఒక ఆడిటోరియం మ్యూజియం ఏర్పాటు చేయుటకు అవసరమైన ప్రతిపాదనలతో ఏజెన్సీ ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డిపిఆర్) తయారు చేయాలన్నారు.
ఇందుకోసం స్థలము నిర్ధారణ చేయాలన్నారు. మొవ్వ మండల తాసిల్దారు చొరవ తీసుకొని ఉప కులపతితో సమన్వయం చేసుకొని మ్యాపింగ్ సిద్ధం చేయాలన్నారు.
సాంస్కృతిక విభాగం నిపుణులు తాడేపల్లి మాట్లాడుతూ తనకు ఎన్సీఈఆర్టీ నుండి కొంత అవగాహన ఉందని బహుళ ప్రయోజన సాంస్కృతిక సముదాయం నిర్మిస్తే బాగుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ సముదాయంలో పేరొందిన కళారూపాలతో దుకాణాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తో అధికారులతో మాట్లాడి సాంస్కృతిక నిధులు ఏమేమి ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. కూచిపూడి గ్రామంలోని సత్రాన్ని వారసత్వ సంపదగా మార్చేందుకు పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
అంతేకాకుండా సిద్ధేంద్ర యోగి నివసించిన ఇంటిని ఆయన స్మృతులను గుర్తు చేసుకుంటూ వారసత్వ సంపద కేంద్రంగా మలిచేందుకు ఆలోచించాలన్నారు. ఇందుకోసం వారి కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడాలన్నారు. కూచిపూడి పరంపర కింద. పొందే ఉపకార వేతనాల గురించి విస్తృతంగా తెలియజేయాల్సి ఉందన్నారు.
కోనేరు నుండి అంతర్గత రహదారులు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ కాలంలో కూచిపూడి నేర్చుకునే కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు.
అందుకు ఉపకులపతి వెంటనే స్పందిస్తూ వచ్చే మే నెలలో 15 రోజులు, 21 రోజులతో కోర్సులు చేపట్టుటకు తగిన నిర్ణయం త్వరలో తీసుకుంటామని ఇందుకోసం ఈనెల 23వ తేదీన డైరెక్టర్లతో మండలి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పర్యాటక శాఖ ఏడి లజ్వంత నాయుడు, ఏపీటీడీసీ ఎస్ ఈ ఈశ్వరయ్య, చీఫ్ మార్కెటింగ్ అధికారి పద్మారాణి, , డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేష్,, పర్యాటక కన్సల్టెంట్ పద్మావతి, మొవ్వ మండల తహసిల్దార్ మస్తాన్, ఎంపీడీవో సుహాసిని తదితర అధికారులు పాల్గొన్నారు.