MachilipatnamLocal News
March 4, 2026
జిల్లా

ఎక్సైజ్ వ్యవస్థను పారదర్శకతకు కేంద్రంగా మార్చాం

  • March 4, 2026
  • 1 min read
[addtoany]
ఎక్సైజ్ వ్యవస్థను పారదర్శకతకు కేంద్రంగా మార్చాం
– జగన్ తన దోపిడీ కోసం ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారు
– సొంత బ్రాండ్లను ప్రజల నెత్తిన రుద్ది జేబులు నింపుకున్నారు
– మద్యం షాపులు, బార్లు కేటాయింపుతో ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం
– అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై చర్చ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర.
 
మచిలీపట్నం :
 
        కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటుగా, పారదర్శకతకు కేంద్రంగా మార్చామని అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై చర్చ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్  దోపిడీకి వాడుకున్నాడని ధ్వజమెత్తారు. జగన్  అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారం మొత్తాన్ని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ పేరుతో విడగొట్టాడు. నాసిరకమైన, కల్తీ మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దాడు. ధరలు పెంచడం, నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడంతో సరిహద్దుల్లో అక్రమ రవాణా తీవ్రతరమైంది. బీర్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. డ్రగ్స్, గంజాయి, నాటు సారా అమ్మకాలను వైసీపీ నేతలే దగ్గరుండి చేశారు. ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన చోట అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి అందలమెక్కించారు. ఐదేళ్లలో సుమారు రూ.98 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్లు 0.6 శాతం మాత్రమే. ఆటోమేటెడ్ ఆర్డర్స్ విధానాన్ని రద్దు చేసి మేన్యువల్ విధానంతో తమ బ్రాండ్లకు ఆయాచిత లబ్ది చేకూరేలా చేశారు.
 
 కూటమి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లలో సుమారు రూ.3200 కోట్ల స్కాం జరిగినట్లు నిరూపించాం. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి మద్యం విధానాన్ని రూపొందించాం. నూతన మద్యం పాలసీ ప్రకటనతో సుమారు 89 వేల దరఖాస్తులు రాగా రూ.1800 కోట్ల ఆదాయం వచ్చింది. గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు కేటాయించాం. లైసెన్సు ఫీజులో 50 సబ్సిడీ ఇచ్చాం. దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండే అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాం. ఫలితంగా పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా నిలిచిపోవడంతో పాటుగా.. ఏపీలోని మద్యం బ్రాండ్లు, ధరల కారణంగా సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు పెరిగాయి. 
 
 ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనలో భాగంగా ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. డిస్టిలరీ నుండి వచ్చే ప్రతి మద్యం బాటిల్‌ను ట్రాక్ చేశాం. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా ప్రజలకు కూడా మద్యం గురించిన వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాం. ప్రతి బ్యాచ్ మద్యాన్ని 9 రకాలుగా పరీక్షించిన తర్వాతనే మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నవోదయం 2.0 ప్రారంభించి రాష్ట్రంలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించాం. ఈగిల్ టీమ్స్ ద్వారా గంజాయిని నిర్మూలించాం. గత ఐదు సంవత్సరాల పాటు మద్యం డిజిటల్ పేమెంట్స్ కేవలం 0.6 శాతం ఉండగా.. ప్రస్తుతం 40 శాతానికి పెంచాం. 
 
 రాష్ట్రంలో జరుగుతున్న పారదర్శకమైన పాలనపై బురద జల్లడమే లక్ష్యంగా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. అందుకు మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనలు నిదర్శనం. ప్రభుత్వంపై నిందమోపేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ మద్యం తయారు చేశారు. ఈ దుర్మార్గంలో మాజీ మంత్రులు భాగస్వాములుగా ఉండడం అత్యంత జుగుప్సాకరం. రాష్ట్రంలో ఎక్సైజ్ వ్యవస్థను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుండి ఎక్సైజ్ అధికారులు వచ్చి ఇక్కడి మద్యం పాలసీని అద్యయనం చేయడం అందుకు నిదర్శనం. మద్యం అక్రమాలకు పాల్పడి.. కూటమి ప్రభుత్వంపై నిందలేస్తామని ప్రయత్నిస్తే సహించేది లేదని, ఎంతటి వారున్నా అందరిపైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
 
 అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. మద్యం కుంభకోణం రూ.3200 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని, కానీ వాస్తవంలో రూ.10 వేల కోట్లకు పైగా ఉండే అవకాశం లేకపోలేదని, విచారణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *