ఈ నెల 17 న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లాలోని 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు వేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసులో అన్ని శాఖల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ డి కె బాలాజీ తెలిపారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి సంబందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ పి యుగంధర్ మాట్లాడుతూ బాలబాలికల జీర్ణ వ్యవస్థలో చేరిన నులి పురుగుల వలన రక్త హీనత ఏర్పడుతుందని, వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నామని అన్నారు. అంగన్వాడీ, అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, నర్సింగ్ సాంకేతిక కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 17న మాత్రలు తీసుకొని వారికి మరల 24వ తేదీన మాప్ అప్ డే నిర్వహించి మాత్రలు అందజేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్, ఆర్బీఎస్ కార్యక్రమ నిర్వహణాధికారి డా. హిమబిందు, ఆర్బీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.