MachilipatnamLocal News
February 12, 2026
స్పెషల్ స్టోరీ

ఆంధ్ర నాట్యానికి పర్యాయపదంలా స్వరనర్తన

  • January 31, 2026
  • 1 min read
[addtoany]
ఆంధ్ర నాట్యానికి పర్యాయపదంలా స్వరనర్తన

 ముదురు రంగు (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ) బంగారు రంగు జరీ అంచు ఉన్న కాంచీపురం, ధర్మవరం పట్టు చీరను ‘కచ్చ’ పోసి కట్టి…. ఆలయ శిల్పకళా సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ‘తల సామాను’ (చంద్రుడు, సూర్యుడు బిళ్ళలు), పాపిడి బిళ్ళ…. చెవులకు జుంకాలు, వాటికి అనుబంధంగా ‘చెవి మాటీలు’… మెడలో కాసుల పేరు, మామిడి పిందెల హారం, గుండ్ల మాల వంటి సంప్రదాయ ఆభరణాలు… నడుముకు వడ్డాణం… చేతులకు వంకీలు (బాహుపురులు), గాజులు… కళ్ళను పెద్దవిగా చూపేలా దట్టంగా కాటుక … నుదుటిపై అందమైన తిలకం దాని చుట్టూ తెల్లని చుక్కల అలంకరణ … అరచేతులకు, పాదాలకు ఎర్రటి అల్తా (గోరింటాకు వంటి ద్రవం)… పొడవైన జడ, దానికి ‘జడ గంటలు’ పూల మాలలు (ముఖ్యంగా మల్లెపూలు)…. పాదాలకు ఇత్తడి గజ్జెలు ధరించి…..

 
         ఈ వస్త్రధారణ, అలంకరణ మీకు మన తెలుగుతనాన్ని మనసులో చూపించిందా! మరి అదే తెలుగుతనంతో నాట్యం చేస్తే ……!!!
 
         మన తెలుగు నేల యొక్క అపురూపమైన శాస్త్రీయ నృత్య రూపాలలో ఈ నాట్యం ఒకటి. ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన కళా సంపద. ఈ నాట్యం ప్రధానంగా స్త్రీలు ప్రదర్శించే నృత్య రీతి. దీనిని పూర్వం లాస్య నర్తనం, కచేరీ, కేళిక, దర్బారు, మేజువాణి అని రకరకాల పేర్లతో పిలిచేవారు.
 
         ఈ నృత్యం సుమారు 2000 నుంచి 3000 ఏళ్ల క్రితమే ఉనికిలో ఉందని ఆధారాలు ఉన్నాయి. బౌద్ధయుగం నాటి ఆరామాలలో, దేవాలయాలలో మరియు రాజ ఆస్థానాలలో ఈ నాట్యం విలసిల్లింది. ఈ నాట్యం ఈరోజు ఒక గుర్తింపు పొందిన శాస్త్రీయ నృత్యంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. దానికి కారణం పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ
       మధ్యయుగంలో ఆదరణ కోల్పోయిన దేవదాసీ నృత్య రీతులను, ఆస్థాన నృత్యాలను, పాత గ్రంథాలను క్షుణ్ణంగా పరిశోధించి, ఈ నాట్యానికి ‘ఆంధ్ర నాట్యం‘ అనే నామకరణం చేసి ఒక క్రమబద్ధమైన రూపాన్ని రామకృష్ణ ఇచ్చారు. నృత్యంలో కేవలం అభినయం మాత్రమే కాకుండా, దానికి అడుగులు (అడవులు), జతులతో పాటు సంప్రదాయ సంగీతాన్ని జోడించి ఒక క్రమపద్ధతిలో  వాటికి శాస్త్రీయ రూపాన్ని ఇచ్చి ‘ఆంధ్ర నాట్యం‘గా తీర్చిదిద్దారు.
       పేరిణి శివతాండవం – కాకతీయుల కాలం నాటి యుద్ధ నృత్యమైన ‘పేరిణి’ని రామప్ప దేవాలయ శిల్పాల ఆధారంగా పునఃసృష్టించిన ఘనత కూడా ఆయనదే.
 
        పిఠాపురం వంటి ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న ‘నవజనార్దనం‘ అనే పారిజాత నృత్య సంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చారు.
 
        ఆంధ్ర నాట్యం ప్రధానంగా మూడు  విభాగాలుగా సాగుతుంది.
      పూర్వం దేవాలయాలలో దేవుడికి షోడశోపచార పూజలు చేసేటప్పుడు చేసే నృత్యాన్ని ‘ఆగమ నర్తనం‘(ఆరాధన నృత్యం) అనేవారు. ఆంధ్ర నాట్యంలో “కుంభ హారతి” అనే ప్రత్యేక ప్రక్రియ ఉంది. ఆలయాలలో హారతి ఇచ్చేటప్పుడు చేసే నృత్యం ఇది.
 
        రాజుల కాలంలో ఆస్థానాలలో వినోదం కోసం మరియు కళా పోషణ కోసం ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారు. అందుకే దీనిని ‘రాజనర్తనం‘(కచేరీ నృత్యం) అని కూడా పిలిచేవారు.
 
        సామాన్య ప్రజల కోసం వీధుల్లో ప్రదర్శించే కళారూపం పారిజాత నృత్యం. (భామాకలాపం, గొల్లకలాపం)
 
ఆంధ్ర నాట్య ఆహార్యం 
 
        ఈ నృత్యంలో ఆహార్యం (వేషధారణ, అలంకరణ) అత్యంత ప్రాముఖ్యమైనది. ఆంధ్ర నాట్య ఆహార్యం భరతనాట్యం మరియు కూచిపూడి శైలులకు దగ్గరగా ఉన్నప్పటికీ, తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
 
వాయిద్యాలు, వేషధారణ
 
          ఈ నాట్యంలో మృదంగం, మంజీర (తాళాలు), వీణ, వయొలిన్, వేణువు ముఖ్యమైన వాయిద్యాలు. నర్తకులు చాలా సొగసైన సాంప్రదాయ వస్త్రధారణతో, అభినయానికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రదర్శన ఇస్తారు.
 ఆంధ్ర నాట్యాన్ని ప్రసిద్ధ నృత్యకారుడు డా. కళాకృష్ణ కూడా దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన ముఖ్యంగా ‘సత్యభామ’ వేషధారణలో చేసే అభినయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
ఆంధ్ర నాట్య ప్రత్యేకత – అభినయం
 
         ఆంధ్ర నాట్యం “అభినయ ప్రధానమైన” నృత్యం. ఇందులో నర్తకి కేవలం నాట్యం చేయడం మాత్రమే కాకుండా, ముఖ కవళికల ద్వారా కథను లేదా భావాన్ని పండిస్తుంది. దీనిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు.
 
         సాత్వికాభినయం – ఇది ఆంధ్ర నాట్యానికి ప్రాణం. మనసులోని భావాలను (కరుణ, శృంగారం, కోపం మొదలైనవి) కళ్ళ ద్వారా, ముఖ కవళికల ద్వారా పలికించడం. ముఖ్యంగా ‘సత్యభామ’ పాత్రలో గర్వం, అసూయ, ప్రేమ వంటి నవరసాలను ముద్రలతో కలిపి ప్రదర్శించడం ఈ నాట్య శైలిలోని గొప్పతనం. ఆంధ్ర నాట్యంలో ‘సత్యభామ’ పాత్ర పోషించేటప్పుడు (భామాకలాపం వంటి ప్రదర్శనల్లో) వస్త్రధారణ ఇంకా వైభవంగా ఉంటుంది. ముఖ్యంగా ‘వేణి‘ (జడ) కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
          ఆంగికాభినయం – హస్త ముద్రలు (చేతి కదలికలు) మరియు శరీర భంగిమల ద్వారా భావాన్ని వ్యక్తపరచడం.
 
శాస్త్రీయ నృత్యంలో భావ ప్రకటనకు ‘ముద్రలు’ చాలా ముఖ్యం. ఆంధ్ర నాట్యంలో ప్రధానంగా అభినయ దర్పణం, భరత ముని నాట్యశాస్త్రం ఆధారంగా ముద్రలను ఉపయోగిస్తారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు:
 
అసంయుత హస్తాలు (ఒంటి చేతి ముద్రలు) – ఇవి ఒకే చేత్తో చేసే ముద్రలు. మొత్తం 28 ముద్రలు ఉంటాయి. 
 
పతాకం: ఐదు వేళ్లు కలిపి నిటారుగా ఉంచడం (ఆశీర్వదించడానికి, ఆకాశాన్ని చూపడానికి వాడతారు).
త్రిపతాకం: పతాక హస్తంలో ఉంగరపు వేలును వంచడం (కిరీటం లేదా చెట్టు కొమ్మను సూచిస్తుంది).
శిఖరం: పిడికిలి బిగించి బొటనవేలు పైకి ఉంచడం (మగతనాన్ని లేదా దేవుడిని సూచిస్తుంది).
 
సంయుత హస్తాలు (జంట చేతి ముద్రలు) – రెండు చేతులను కలిపి చేసే ముద్రలు 24 ఉంటాయి.
 
అంజలి: రెండు చేతులు జోడించడం (నమస్కారం).
కపోతం: అంజలి ముద్ర మధ్యలో కొంచెం ఖాళీ ఉంచడం (వినయం లేదా పావురాన్ని సూచిస్తుంది).
శంఖం: రెండు చేతులతో శంఖం ఆకారం చేయడం.
 
వాచికాభినయం – నర్తకి స్వయంగా పదాలు లేదా శ్లోకాలు పలకడం లేదా నేపథ్య గానానికి అనుగుణంగా భావ వ్యక్తీకరణ చేయడం.
 
ఆంధ్ర నాట్యం – ఒక ప్రత్యేకత
 
           ఆంధ్ర నాట్యంలో “నవ జనార్దనం” అనే ప్రక్రియ చాలా ప్రసిద్ధి. ఇందులో సత్యభామ విరహ వేదనను, కృష్ణుడిపై ఆమెకున్న ప్రేమను అద్భుతమైన అభినయంతో ప్రదర్శిస్తారు. సత్యభామ పాత్ర పోషించే నర్తకి, ఒకే చోట కూర్చుని గంటల తరబడి కేవలం ముఖ కవళికలతోనే భావాలను పండించడం ఒక అద్భుతమైన విద్య.
      
          పూర్వ కాలంలో రాజ్యాలు ఉండేవి. వాటిని పాలించే రాజులు నాట్యం తో పాటు పలు రకాల కళలనూ, సాహిత్యాన్ని పోషించేవారు.  నేటి తరంలో కొన్ని కళాభిమానం, సాహిత్యాభిలాష ఉన్న సంస్థలు కళలను ఆదరించి, ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి కోవకు చెందిందే స్వరనర్తన సంస్థ. కళాతృష్ణ గల శ్రీమతి కర్నాటి నవత, శ్రీమతి దెందులూరి పద్మా మోహన్ ల ఆధ్వర్యంలో నడపబడుతున్న సంగీత నృత్య శిక్షణా సంస్థ స్వరనర్తన.  ఈ సంస్థ ఆంధ్ర నాట్యానికి బహుళ ప్రాచుర్యం కల్పించడంతో పాటు నాట్య కళాకారులను ప్రోత్సహిస్తూ ఆంధ్ర నాట్యానికి పర్యాయపదంలా నిలుస్తుంది.

 

          వీక్షకులకు మనోల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచే  ఆంధ్ర నాట్యం  8,ఫిబ్రవరి 2026 ఆదివారం సాయంత్రం 6గంటలకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా. కళా కృష్ణ పర్యవేక్షణలో  స్వరనర్తన సమర్పణలో ఆంధ్ర నాట్య సంగమం నృత్య ప్రదర్శన, శ్రీమతి పద్మా మోహన్ దెందులూరి చే ప్రత్యేక నవ జనార్ధన పారిజాత ప్రదర్శన మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడ నందు నిర్వహించబడుతుంది.

శ్యామ్ కాగిత,
మచిలీపట్నం 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *