తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా తేలిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో శనివారం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
రామానాయుడు పేటలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పేర్ని కిట్టు, కూటమి నాయకుల విమర్శలపై తీవ్రంగా మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి కోసం దేవుని పేరును వాడుకోవడం తగదని ఆయన హితవు పలికారు. సీబీఐ ఛార్జ్‌షీట్ స్పష్టంగా నిజాలను వెల్లడించినప్పటికీ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ చైర్‌పర్సన్ చిటికెన వెంకటేశ్వరమ్మతో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.