మచిలీపట్నం:
జిల్లాకు చెందిన ఇరువురు విద్యార్థినులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం జిల్లాకే గర్వకారణం అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
ఇటీవల ఈ ఇరువరు విద్యార్థినులు జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ జాకీర్ అహ్మద్ మార్గదర్శకంతో
బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించే యాప్ ను తయారు చేశారు. దేశవ్యాప్తంగా 1000 ప్రాజెక్టులు ఎంపిక కాగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అందులో ఒకటి కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు తయారుచేసిన ప్రాజెక్టు కాగా మరొకటి శ్రీకాకుళం జిల్లా కుప్పిలకు చెందిన విద్యార్థుల ప్రాజెక్టు ఎంపికయ్యాయి. దీంతో న్యూఢిల్లీలోని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుండి ఈనెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం లభించింది. ఆ మేరకు వారు జిల్లా సైన్స్ అధికారితో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి సుబ్బారావు మొవ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న ఇరువురు విద్యార్థినులు దావు స్నేహశ్రీ, కాకి సౌమ్యలను వెంటబెట్టుకుని జిల్లా కలెక్టర్ ను నగరంలోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మార్గదర్శకంగా నిలిచిన సైన్స్ అధికారిని విద్యార్థినులను అభినందిస్తూ శాలువులతో సత్కరించారు. అలాగే భవిష్యత్తులో వారు ఏమవుతారని వివరాలను అడిగి తెలుసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉద్భోదించారు.