నా భారతదేశం నా ఓటు
SSN
- January 25, 2026
- 1 min read
[addtoany]
మచిలీపట్నం :
ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మి టాకీస్ కూడలి నుండి జడ్పీకన్వెన్షన్ హాల్ వరకు కాలినడగన నా భారతదేశం నా ఓటు అనే నినాదంతో పచ్చ జెండా ఊపి ర్యాలీనీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం 1950 సంవత్సరం జనవరి 25వ తేదీన ఆవిర్భవించిందని, అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం అదే రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
మనకు 1947లో స్వాతంత్రం వచ్చాక చాలామంది దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగద లేదని విశ్లేషించారన్నారు. విదేశాల్లో ఉన్న రాజకీయ శాస్త్రవేత్తలు త్వరలో భారతదేశం లో ప్రజాస్వామ్యం కూలిపోతుందని చెప్పారన్నాన్నారు. అయితే ఆ రోజున భారత రాజ్యాంగం లో పొందుపరిచిన అంశాలు ఎన్నికల సంఘం ప్రతి సందర్భంలో ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాల వలన 77 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందన్నారు
తదనంతరం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లాస్థాయి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతాలాపనతో ప్రారంభించారు
ఈ సందర్భంగా డిఆర్ఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ. జిల్లాలో 15 లక్షల 44వేల 568 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అందులో పురుషులు 7 లక్షల 47వేల 659 మంది ఉండగా స్త్రీ ఓటర్లు 7 లక్షల 96 వేల 860 మంది ఉన్నారన్నారు. మరో 49 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నారన్నారు. మన దేశంలో యువత ఎక్కువగా ఉందన్నారు. వారు తక్కువగా పేర్లను నమోదు చేసుకుంటున్నారన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. మన దేశంలో ఉన్న పారదర్శక ఎన్నికల విధానం మరే దేశంలోనూ లేదన్నారు. ప్రతినెల జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలు తీసుకొని పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి కృషి చేస్తున్నారన్నారు
రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీర వెంకట గురుమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పునాది లాంటిదని, దేశానికి పునాది పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడగలుగుతుందన్నారు. ఓటు హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా కల్పించిన వజ్రాయుధం అని, మంచి ప్రభుత్వాలు రావడానికి ఆలోచించి ఓటు వేయాలన్నారు. చాలామంది ఓటు వేయడానికి రాకుండా కొన్ని పనులు, వ్యాపారం, వ్యవసాయం ఉన్నాయంటూ ఒక గంట కూడా కేటాయించలేకపోతున్నారన్నారు.
గతంలో ముఖ్య ఎన్నికల కమిషనర్ టిఎన్ స్టేషన్ ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు.
తదుపరి వయోవృద్ధులైన ఓటర్లను శాలువలు, పూలమాలతో ఘనంగా అతిధులు సత్కరించారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో విశేషంగా ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, డీఈవో సుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి శంకర్నాథ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, అబ్దుల్ మథీన్, కొడాలి శర్మ, పంతం వెంకట గజేంద్ర రావు, తదితర అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఎన్సిసి క్యాడేట్లు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

