MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

2026–27 సంవత్సర ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ అంచనా బడ్జెట్ను ఆమోదించిన జెడ్పీ పాలకవర్గం..

  • January 22, 2026
  • 1 min read
[addtoany]
2026–27 సంవత్సర ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ అంచనా బడ్జెట్ను ఆమోదించిన జెడ్పీ పాలకవర్గం..
జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలు..
 
మచిలీపట్నం: 
 
       గురువారం జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. సమావేశంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం 2025–26 సంవత్సర సవరణ బడ్జెట్, అదేవిధంగా 2026–27 సంవత్సర అంచనాల బడ్జెట్ను ఆమోదించారు.
 
        కృష్ణా జిల్లా ప్రజా పరిషత్, 2025-26 సంవత్సర సవరణ బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.143,97,36,614 కాగా ఆదాయము అంచనా రూ.817,82,04,492 గాను ఖర్చు అంచనా రూ.841,44,99,492 కాగా ముగింపు నిల్వ అంచనా రూ.120,34,41,614 గా చూపారు.
 
        అదేవిధంగా 2026-27 సంవత్సర బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ రూ.120,34,41,614 కాగా ఆదాయము అంచనా రూ.2140,12,78,469 గాను ఖర్చు అంచనా రూ.2123,99,95,149 కాగా ముగింపు నిల్వ అంచనా రూ.136,47,25,114 గా చూపించారు.
 
           తొలుత జరిగిన స్థాయి సంఘ సమావేశాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, స్త్రీ సంక్షేమం రక్షణ, ప్లానింగ్ ఆర్థికం, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా అంశాలపై సభ్యులు సమస్యలను లేవనెత్తగా సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు.
 
           మొవ్వ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు సరైన ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్న వసతి భవనాన్ని కూల్చివేశారని, ఈ విషయంలో ఆ శాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు జడ్పీ సీఈఓను కోరారు.
 
         ఎన్టీఆర్ జిల్లాలోని కొంతమంది రైతులకు గత సంవత్సర ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించిన రవాణా చార్జీలు ఇప్పటికీ చెల్లించలేదని కొంతమంది సభ్యులు సమస్యలు లేవనెత్తగా, అట్టి రైతుల జాబితాను సమర్పించాలని దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరాల జిల్లా మేనేజర్ తెలిపారు. 
 
        దాల్వ పంట లేక కృత్తివెన్ను మండలంలో చాలా పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయని, అందుకు ప్రత్యామ్నాయ అనువైన పంటలు వేసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించలేదని మండల జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా మండలంలోని చినగొల్లపాలెం గ్రామానికి తాగునీరు అందడం లేదని, వచ్చే వేసవి నాటికి ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని, ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. కంచికచర్ల మండలంలో సైతం మంచినీటి పైపులు తుప్పు పట్టి పాడైపోయాయని, సరిగా నీటి సరఫరా జరగడంలేదని, మరమ్మతులు చేపట్టాలని ఆ మండల సభ్యురాలు సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చారు.
 
          ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు, నూజివీడు మండలాల్లో అత్యధికంగా మామిడి సాగు చేస్తున్నారని, అయితే నకిలీ పురుగు మందులతో రైతులు మోసపోతున్నారని, సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా యూరియా కొరత లేకుండా చూడాలని సభ్యులు కోరారు.
 
         తమ సమస్యలను చెప్పుకునేందుకు జెడ్పీ సమావేశాలకు ఏలూరు జిల్లాకు చెందిన అధికారులు హాజరుకావడం లేదని, ప్రతిసారి ఇలాగే జరుగుతోందని, ఇకనైనా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారిక సమావేశాలకు అధికారులు ఇప్పటకీ ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు సభ్యులు జెడ్పీ సీఈవో దృష్టికి తెచ్చి అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించాలని పై అధికారులు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి అధికారులు ఆదేశాలు పాటించడం లేదని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
         రూ. 1.25 కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్ సమావేశపు మందిరం, చైర్ పర్సన్ చాంబర్, సీఈవో ఛాంబర్, మరుగుదొడ్లు తదితర విభాగాలను ఆధునికరించేందుకు బడ్జెట్ కేటాయించామని, అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం అవుతాయని జడ్పీ చైర్పర్సన్ ఈ సందర్భంగా తెలిపారు. 
 
           సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, బందరు ఇన్చార్జి ఆర్డీవో పోతురాజు, వివిధ ప్రభుత్వ శాఖల ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *