పరాక్రమ దివస్
SSN
- January 23, 2026
- 1 min read
పరాక్రమ దివస్
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ‘నేతాజీ’గా పిలవబడే సుభాష్ చంద్రబోస్ ఒక అద్వితీయమైన నాయకుడు. “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అనే ఆయన నినాదం దేశవ్యాప్తంగా యువతలో ఉత్తేజాన్ని నింపింది.
జనవరి 23 నేతాజీ జన్మదినం(పరాక్రమ దివస్) సందర్భంగా అయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలు చూద్దాం.
సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో ప్రసిద్ధ న్యాయవాది జానకీనాథ్ బోస్, ప్రభావతీ దేవిలకు జన్మించారు. సుభాష్ చంద్రబోస్ తన తల్లిదండ్రులకు 9వ సంతానం (మొత్తం 14 మంది పిల్లలు – 8 మంది కుమారులు, 6 మంది కుమార్తెలు). ఆయన సోదరులలో శరత్ చంద్రబోస్ నేతాజీకి అత్యంత సన్నిహితులు. శరత్ చంద్రబోస్ కూడా స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.
నేతాజీ తండ్రి కోరిక మేరకు లండన్ వెళ్లి ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. 1920లో జరిగిన ఈ పరీక్షలో ఆయన 4వ ర్యాంకు సాధించారు. కానీ, బ్రిటిష్ వారి కింద పనిచేయడం ఇష్టం లేక 1921లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత దేశానికి తిరిగి వచ్చారు.
భారతదేశం వచ్చిన తర్వాత చిత్తరంజన్ దాస్ మార్గదర్శకత్వంలో స్వాతంత్య్ర పోరాటంలో చేరారు.1938లో హరిపుర మరియు 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షుడిగా ఎన్నికైన బోస్, మహాత్మా గాంధీతో సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కాంగ్రెస్‌ను వీడి ‘ఫార్వర్డ్ బ్లాక్’ (Forward Bloc) పార్టీని స్థాపించారు. ‘జై హింద్’, ‘ఢిల్లీ చలో’ వంటి నినాదాలు నేతాజీ రూపొందించినవే.

ఆజాద్ హింద్ ఫౌజ్ (INA)
ఆజాద్ హింద్ ఫౌజ్‌ను సెప్టెంబరు 1, 1942న సింగపూర్‌లో కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యానికి బందీలుగా చిక్కిన భారతీయ సైనికులతో దీనిని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ బిహారీ బోస్ మార్గదర్శకత్వం వహించారు.
అయితే నాయకత్వ విభేదాల వల్ల మొదటి దశలో సైన్యం కొంత బలహీనపడింది. ఆ సమయంలో రాష్ బిహారీ బోస్ ఆహ్వానం మేరకు సుభాష్ చంద్రబోస్ సింగపూర్ చేరుకుని, జూలై 1943లో ఐ.ఎన్.ఏ బాధ్యతలను స్వీకరించి, మరింత శక్తివంతంగా మార్చారు. బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి సైనిక శక్తి అవసరమని నమ్మిన బోస్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రహస్యంగా విదేశాలకు వెళ్లి జపాన్ సహకారంతో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ (Indian National Army – INA) ను పునర్వ్యవస్థీకరించారు.
సైన్యంలోని విభాగాలు
నేతాజీ ఈ సైన్యాన్ని బలోపేతం చేసి, దళాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టారు. ఈ సైన్యంలో గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్ మరియు ఆజాద్ బ్రిగేడ్ అనే విభాగాలు ఉండేవి. 
ఆసియాలోనే మొదటిసారిగా మహిళల కోసం ‘ఝాన్సీ రాణి రెజిమెంట్’ను నేతాజీ ఏర్పాటు చేశారు. ఇందులో వేలాది మంది భారతీయ మహిళలు శిక్షణ పొంది యుద్ధంలో పాల్గొన్నారు. దీనికి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహించారు.
ప్రభుత్వ ఏర్పాటు
1943 అక్టోబర్ 21న సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్’ (తాత్కాలిక భారత ప్రభుత్వం)ను ఆయన ప్రకటించారు. దీనిని జపాన్, జర్మనీ వంటి 9 దేశాలు గుర్తించాయి.
బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టడానికి నేతాజీ ఈ సైన్యం ద్వారా బర్మా (మయన్మార్), కోహిమా మరియు ఇంఫాల్ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడారు.
నేతాజీ రచనలునేతాజీ సుభాష్ చంద్రబోస్ కేవలం గొప్ప పోరాట యోధుడే కాదు; మంచి రచయిత, ఆలోచనాపరుడు కూడా. ఆయన తన జీవిత విశేషాలను, రాజకీయ అభిప్రాయాలను వివరిస్తూ కొన్ని పుస్తకాలను రాశారు.
ది ఇండియన్ స్ట్రగుల్ (The Indian Struggle, 1920–1942) – ఇది నేతాజీ రాసిన అత్యంత ప్రసిద్ధ పుస్తకం. ఇందులో 1920 నుండి 1942 వరకు భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను ఆయన విశ్లేషించారు. ఈ పుస్తకం బ్రిటీష్ వారి పాలనలోని లోపాలను, భారత జాతీయ కాంగ్రెస్ వ్యూహాలను నిశితంగా వివరిస్తుంది. అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని భారతదేశంలో నిషేధించింది.
1934లో బోస్ ఈ పుస్తకం రాస్తున్న సమయంలో ఆస్ట్రియా దేశస్థురాలు ఎమిలీ షెంకెల్ (Emilie Schenkl) ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. బోస్ ఆమెను 1937లో ఆస్ట్రియాలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి 1942 నవంబర్ 29న కుమార్తె అనితా బోస్ పాఫ్ (Anita Bose Pfaff) జన్మించారు. అనితా బోస్ ప్రస్తుతం జర్మనీలో ప్రముఖ ఆర్థికవేత్తగా స్థిరపడ్డారు.
ఆన్ ఇండియన్ పిలిగ్రిమ్ (An Indian Pilgrim) – ఇది నేతాజీ యొక్క ఆత్మకథ (Autobiography). అయితే ఇది పూర్తిస్థాయిలో ముగియలేదు (అసంపూర్ణమైనది). ఇందులో ఆయన బాల్యం, విద్యాభ్యాసం, ఐ.సి.ఎస్ (ICS) పరీక్షలో సాధించిన విజయం మరియు ఆయనలోని ఆధ్యాత్మిక చింతన గురించి వివరించారు. 1897 నుండి 1921 వరకు ఆయన జీవిత విశేషాలు ఇందులో ఉన్నాయి.
తరుణేర్ స్వప్న (Taruner Swapna) – దీనిని తెలుగులో ‘యువత కల’ అని అనవచ్చు. ఇది బెంగాలీలో రాయబడింది. ఈ పుస్తకం ముఖ్యంగా యువతను ఉద్దేశించి రాసినది. దేశభక్తి, క్రమశిక్షణ మరియు యువత బాధ్యతల గురించి ఇందులో గొప్ప సందేశాలు ఉన్నాయి.
లెటర్స్ టు ఎమిలీ శంకెల్ (Letters to Emilie Schenkl) – నేతాజీ తన భార్య ఎమిలీ శంకెల్‌కు 1934 నుండి 1942 మధ్య రాసిన ఉత్తరాల సంకలనం ఇది. ఈ ఉత్తరాలు నేతాజీ వ్యక్తిగత జీవితాన్ని, ఆయనలోని సున్నితమైన భావాలను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. నేతాజీ ప్రసంగాలన్నీ కలిపి “నేతాజీ: కలెక్టెడ్ వర్క్స్” (Netaji: Collected Works) పేరుతో 12 సంపుటాలుగా ప్రచురించబడ్డాయి.
అదృశ్యం – మిస్టరీ
1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ, ఆయన మరణం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. ఆయన ఆ ప్రమాదం నుండి తప్పించుకుని అజ్ఞాతంలో ఉన్నారని చాలామంది నమ్ముతారు. దీనిపై భారత ప్రభుత్వం పలు కమిషన్లను (షా నవాజ్ కమిటీ, ఖోస్లా కమిషన్, ముఖర్జీ కమిషన్) కూడా ఏర్పాటు చేసింది.
నేతాజీ పరాక్రమాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 23ను ‘పరాక్రమ దివస్‘గా నిర్వహిస్తోంది.
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

