కార్యకర్త కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శ
SSN
- January 21, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం :
అవయవాల దానం చేసిన చందు వీర వెంకట వసంతరాయల కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
బుధవారం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలోని పెద్ద చందాల గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, అవయవాలు దానం చేసిన చందు వీర వెంకట వసంత రాయలు స్వగృహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
వసంత రాయలు గత సంవత్సరం జూలై మాసం 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర దిగమర్రు గ్రామంలో రహదారి ప్రమాదానికి గురై గుంటూరులోని ఈస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 3 వ తేదీన మృతి చెందారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతని 6 అవయవాలను జీవనధార్ వెబ్సైట్ ద్వారా దానం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం వసంతరాయులు ఇంటికి వచ్చి అతని సతీమణి నాగ పుష్పవతి(45),కుమారుడు సీతారామరాజు (25),కుమార్తె జాహ్నవి (21) లను కలిసి వసంత రాయల చిత్రపటానికి పూలమాల వేసి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వసంత రాయలు కుటుంబ సభ్యులను ఓదార్చి, పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు అని వివరాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున క్రియాశీలక సభ్యులకు అందజేసే రూ.5 లక్షల బీమా చెక్కును రాయలు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అందచేశారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పుట్టెడు దుఃఖం గుండెల్లో పెట్టుకొని అవయవాల దానానికి ముందుకు వచ్చిన వసంతరాయుల కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. అతని కుమార్తె జాహ్నవికి వినికిడి లోపంతో పాటు మాటలు రావని తెలుసుకున్నానని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా సహాయం అందించాలని అధికారులకు సూచించామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఉపముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణ్ శివ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, పెడన అవనిగడ్డ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు, జెడ్పి సిఈఓ కన్నమ నాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డీఎఫ్ఓ సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణ రావు, ఎన్ ఐ సి డి ఐ ఓ పని కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ,మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ చైర్మన్ తులసిరావు , తహసిల్దార్ శశి కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరావు, స్థానిక నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ, పంతం వెంకట గజేంద్రరావు, నర్సాపురం మాజీ ఎంపీపీ కనకరాజు, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

