MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • January 20, 2026
  • 0 min read
[addtoany]
సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
 
జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా తొలకరి వర్షాలు రాక మునుపే విత్తనపు బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లే కార్యక్రమాన్ని( పీఎండిఎస్ )జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 
 
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వనరులను వినియోగించుకొని వ్యవసాయం చేస్తే సుస్థిరంగా ఉంటుందని, రైతులు ఆ దిశగా దృష్టి సారించాలన్నారు. 
 
ఇందుకోసం వ్యవసాయ అధికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అన్ని విధాల శిక్షణ ఇచ్చి సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పంట ఉత్పత్తులు నాణ్యతతో పాటు అధిక లాభాలు పొందవచ్చన్నారు.
 
ఇందులో భాగంగా తొలకరి వర్షాలు కురవక మునుపే 32 రకాల పంటల విత్తనాలతో బంతులను ( సీడ్ బాల్స్) తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
 
ఆ సీడ్ బాల్స్ ను వచ్చే ఏప్రిల్ మాసంలో పంట పొలాల్లో వెదజల్లాల్సి ఉంటుందన్నారు. దీంతో ఒకే పొలంలో వివిధ రకాల పంటల ఉత్పత్తులు సంవత్సరం పొడుగునా చేతికి అంది వస్తాయన్నారు 
 
ఇంకా రెండు నెలల సమయం ఉన్నందున ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. 
ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ రైతుల సహకారం కూడా తీసుకొని వారి ఆధ్వర్యంలోనే వారి అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటూ శిక్షణా తరగతులు సమావేశాలు నిర్వహించాలన్నారు. శిక్షణ పొందని గ్రామాల్లోని రైతులకు పక్కనున్న శిక్షణ పొందిన గ్రామాలకు అనుసంధానం చేయాలన్నారు.
ముందు నుంచే రైతులకు అవగాహన కలిగించడం వలన తొలకరి వర్షాల సమయంలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. 
 
డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లితే వేగంగాను, సమానంగాను నేలపై పడతాయని ఆ దిశగా డ్రోన్ ను సిద్ధం చేయాలన్నారు. ప్రధానంగా విత్తనపు బంతులు సీడ్ బాల్స్ తయారీ ముమ్మరం చేయాలన్నారు. 
 
బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో ప్రయోగాత్మకంగా విత్తనపు బంతులును వినియోగించాలని సూచించారు. వచ్చే ఫిబ్రవరి నెల 13వ తేదీన సమావేశం నిర్వహిస్తామన్నారు ఆలోగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రదేశంలో మొలకెత్తిన పంట ఉత్పత్తులను గమనించవచ్చన్నారు. 
 
గ్రామాల్లో వ్యవసాయ సహాయకులను అప్రమత్తం చేసి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగించాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరపు డైరీని, క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
 
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, ఘంటసాల కెవికె సమన్వయకర్త డాక్టర్ సుధారాణి, వ్యవసాయ సహాయ సంచాలకులు మనిధర్, పార్థసారథి, సునీల్, కవిత, రమాదేవి, స్వర్ణలత, కిరణ్, శైలజ పలువురు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *