మచిలీపట్నం:
మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి నగరంలోని రహదారులు భవనాలు అతిథి గృహంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వsహించి అభివృద్ధి పనులపై సమీక్షించారు.
ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో చేపట్టిన గృహ నిర్మాణ పథకం, మచిలీపట్నం నగరపాలక సంస్థ, ముడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రివర్యులు జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో 6,185 ఇంటి ప్లాట్ లకు గాను 4,550 ఇల్లు మంజూరు చేసి కేటాయించగా 2010 ఇల్లు కొన్ని పూర్తయి మరికొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు.
అలాగే పట్టణ ప్రాంతంలో 20,602 ఇళ్ల ప్లాట్లకు గాను 15,588 ఇళ్ళు మంజూరు చేసి స్థలాలు కేటాయించగా 3,018 ఇల్లు కొన్ని పూర్తికాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు. పురోగతిలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఖాళీగా ఉన్న ప్లాట్లను, ఇంకా నిర్మాణం మొదలుపెట్టని ఇళ్ల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. మునిసిపల్ పరిధిలో వివిధ మురికి కాలువలు, రహదారుల నిర్మాణ పనులను ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన సత్వరమే పూర్తి చేయాలన్నారు
.
నియోజకవర్గంలో అందరు ఓడరేవు, ఫిషింగ్ హార్బర్ త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా వాటి ఆధారంగా వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వారందరినీ ప్రోత్సహించేందుకు వీలుగా అవసరమైన స్థలాలను వెంటనే కేటాయించుటకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
అలాగే నియోజకవర్గంలో మంగినపూడి బీచ్ ఆధారంగా పర్యాటక అభివృద్ధికి సంబంధించిన వివిధ పనులను చేపట్టే దిశగా ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, ప్రజారోగ్య శాఖ ఈ ఈ ప్రవీణ్, ముడా కార్యాలయ సిటీ ప్లానర్ సుగుణ కుమారి, తహసిల్దారు మధుసూదన్ పలువురు ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.