చరిత్రపుటల్లో మచిలీపట్నంకు విశిష్ట స్థానం – మచిలీపట్నం చరిత్రని తిరగరాసిన కోనేరు (సెంటర్) అయినా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
SSN
- January 18, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం:
కోనేరు సెంటర్ …
నేడు మచిలీపట్నం నడిబొడ్డున ప్రధాన వ్యాపార కేంద్రంగా కోనేరుసెంటర్ పేరుగాంచింది. కానీ చరిత్ర పుటల్లోకి వెళితే 19వ శతాబ్దంలో మచిలీపట్నం పట్టణ వాసుల దాహార్తిని తీర్చటానికి దీని నిర్మాణం జరిగింది.
అది 1864, నవంబర్ 1 వ తేదీ అర్ధరాత్రి సముద్రం ఒక్కసారిగా పట్టణం లోనికి చొచ్చుకుని ఉప్పెన వచ్చింది. బ్రిటిష్ లెక్కల ప్రకారం అప్పటికి పట్టణ జనాభా 65వేలు. నవంబర్ 1, ఉప్పెనలో దాదాపు 30వేల మంది మరణించడంతో పట్టణ జనాభా నవంబర్ 2 వ తేదీన 35వేలకు చేరింది. సముద్రపు ఉప్పు నీరు పట్టణమంతా వ్యాపించడంతో బావులన్నీ ఉప్పు నీటితో నిండిపోయాయి. త్రాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడింది.
పట్టణంలోని వ్యాపారులందరూ కలిసి మంచి నీటి అవసరాల కోసం 17వేల రూపాయలు సేకరించి అప్పటి జిల్లా కలెక్టర్ థారన్ హిల్ కు ఇవ్వగా, అయన ఆ మొత్తానికి ప్రభుత్వ వాటాగా 30వేల రూపాయలు సమకూర్చారు. దాంతో 1869 లో బొడ్డు రాయిగా ఉన్న నేటి కోనేరు సెంటర్ ప్రాంతంలో పెద్ద కోనేరు తవ్వించారు. కాలేఖాన్ పేట మంచినీటి కాలువ నాగులేరు నుండి భూగర్భ పైప్ లైన్ నిర్మించి కోనేటికి మంచి నీటిని తరలించి పట్టణ వాసుల దాహార్తిని తీర్చారు.
దాంతో గుంటూరుకు తరలి పోవాల్సిన జిల్లా రాజధాని కోనేరు వల్ల ప్రజలందరికీ నీరందడంతో మచిలీపట్నలోనే కొనసాగింది.
స్వాతంత్రోద్యమంలో……
స్వాతంత్రోద్యమంలో ఎన్నో సభలు, సమావేశాలకు కోనేరుసెంటర్ వేదికగా నిలిచింది. 1930లో మహాత్మా గాంధీ అరెస్టుకు నిరసనగా కోనేరు సెంటర్లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తోట నరసయ్య నాయుడు నాయకత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన, మరో ఇద్దరు నాయకులతో కలిసి కోనేరు సెంటర్‌లోని పొడవైన స్తంభంపై జెండా ఎగరవేయడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి లాఠీలతో కొట్టారు. పోలీసులు కొడుతున్నప్పటికీ, నరసయ్య నాయుడు నినాదాలు చేస్తూనే జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి తోట నరసయ్య నాయుడుకి జెండా వీరుడు అని పేరు వచ్చింది. తరువాత సమయంలో కూడా మచిలీపట్నంలో ఎన్నో ఉద్యమాలకు కోనేరు సెంటర్ పేరు గాంచింది.
మరి నేటి పరిస్థితి……
అన్ని పండుగలూ కోనేరు సెంటర్ కి వస్తున్నాయి కానీ కోనేరు సెంటర్ కి పండుగ వచ్చేనా! అన్నట్లు ఉంది నేటి పరిస్థితి.
వినాయక చవితి ఊరేగింపు లకు, దసరా నవరాత్రి శక్తి పటాల ఉత్సవాలకు, క్రిస్మస్ సంబరాలకు, మొహర్రం చెస్ట్ బీటింగ్ కు, మతాలతో సంబంధం లేకుండా సర్వమత కార్యక్రమాలకు వేదిక… బందరు కోనేరు సెంటర్. స్థానిక నాయకులకైనా, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులకైనా బహిరంగ సమావేశాలకు వేదిక కోనేరు సెంటర్.
పండుగలకు, కార్యక్రమాలకు, సమావేశాలకు విద్యుత్ కాంతులతో వెలిగే కోనేరు సెంటర్ వెలుగు కి కళ్ళు మెరవాల్సిందే! మరి ముక్కు?
ముక్కు మూయాల్సిందే!
అవును, ఘాటైన మురుగు వాసనకు ముక్కు మూయాల్సిందే!
నిత్యం జనంతో రద్దీగా ఉండే కోనేరు సెంటర్ కి వెళ్లిన వారెవరైనా సరే మురుగు వాసనకూ, ఉచ్చ కంపుకూ ముక్కు మూయాల్సిందే!
కళ్ళతో పాటు ముక్కుకు కూడా మన కోనేరు సెంటర్ ఎప్పటికైనా ఆహ్లాదాన్నిచ్చేనా అని ఎదురుచూసే సగటు బందరు వాసి అన్యాపదేశంగా కోనేరు సెంటర్ ప్రారంభం లోనే ముక్కు మూసుకోవటానికి అలవాటు పడిపోయాడు.
పాలకుల నిర్లక్ష్యం….
మచిలీపట్నం చరిత్రను తిరగరాసి, ప్రజల దాహార్తిని తీర్చి, ఎన్నో ఉద్యమాలకు నెలవైన కోనేరు సెంటర్ విషయంలో పాలకులు శ్రద్ధ చూపకపోవడం బాధాకరం. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, కూటమి అంటూ ప్రభుత్వాలు మారుతున్నా… కోనేరు సెంటర్ పరిస్థితి మాత్రం నానాటికి అధ్వాన్నంగా తయారవుతుంది.
మన పూర్వీకులు… దాహార్తిని తీర్చుకోవడానికి నిర్మించుకున్న ఆ కోనేరును, స్వాతంత్రోద్యమ సాక్షిగా నిలిచిన ఆ కేంద్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అటు అధికారుల మీద, ఇటు ప్రజల మీద ఉంది. “ముక్కు మూసుకోకుండా” గర్వంగా కోనేరు సెంటర్లో అడుగుపెట్టే రోజు రావాలని ఆశిద్దాం.
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

