నగరంలో క్రైస్తవులు డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. పాపుల రక్షణ కొరకు ఏసుక్రీస్తు భూమిపై జన్మించిన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగ గా క్రైస్తవులు జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ మొదటివారం నుండి క్రిస్మస్ రోజు వరకు క్రైస్తవులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నగరంలోని చర్చిలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రైస్తవులు ప్రార్ధన మందిరాలలో అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం వరకు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. ప్రతి క్రైస్తవుల ఇంటిముందు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని స్టార్, క్రిస్మస్ ట్రీ లను ఏర్పాటు చేస్తారు.
గురువారం ఉదయం నూతన వస్త్రాలను ధరించి ఆత్మీయ లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చి ఫాదర్ ల ఆశీర్వాదాన్ని పొందుతారు. అలానే ప్రపంచశాంతికి చిహ్నమైన క్రీస్తు బోధనలను పాటిస్తూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. పండగ సందర్భంగా పిండివంటలను చేసి సహచరులకు పంపిణీ చేస్తారు. క్రీస్తు యేసు శాంతి మార్గాన్ని క్రైస్తవులు పాటిస్తూ ప్రచారం చేస్తారు. హిందువులు సైతం క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు.