MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

బలమైన కుటుంబ వ్యవస్థ ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం –– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి

  • December 20, 2025
  • 0 min read
[addtoany]
బలమైన కుటుంబ వ్యవస్థ ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం –– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి
పెడన: 
 
ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు సామాజిక స్థిరత్వానికి మూలం, నేరాలు, సామాజిక వ్యతిరేక ప్రవర్తనలను తగ్గిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి పేర్కొన్నారు.
 
శనివారం ఉదయం పెడన మండలంలోని పెడన ఫంక్షన్ హాల్లో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఏ), ప్రభుత్వానికి న్యాయవ్యవస్థలకు మధ్య వారధిగా ఉండి పని చేస్తుందన్నారు. డిఎల్ఎస్ఏ, రాజీ మార్గం ద్వారా కక్షిదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందిస్తుందన్నారు. సామాన్యులకు న్యాయం అందుబాటులో ఉంచడం, సాంఘిక దురాచారాల పోరాటంపై ప్రజలకు అవగాహన కల్పించడం, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా దూరమైన వారిని గుర్తించి వారికి చేరువ చేసేలా చర్యలు తీసుకోవడంపై డిఎల్ఎస్ఎ విశేష కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్పించుకుని అవసరం మేరకు మాత్రమే వాటిని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
 
ప్రపంచంలో అత్యధిక యువత జనాభా కలిగిన దేశం భారత్ అని, కానీ గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసై జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు సరైన మార్గంలో పయనించాలంటే ముందు తల్లిదండ్రుల ఆలోచనలు, ప్రవర్తన ఆదర్శంగా ఉండాలన్నారు.
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ సమాజంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరగటం విచారకరమన్నారు. వివాహానికి సరైన వయసు లేకపోవడం వల్ల తల్లితోపాటు పుట్టబోయే సంతానికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
 
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉండి న్యాయ సహాయం అవసరమైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు అందించడం అభినందనీయమని, దీనిపై అవగాహన కలిగి డిఎల్ఎస్ఎ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజంలోని యువత మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను దుర్భలం చేసుకోవద్దని కోరారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర ఎంతో కీలకమని చెబుతూ, వారి మానసిక ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.
 
డిఆర్ఓ మాట్లాడుతూ కుటుంబంలో పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతూ, వారితో ప్రేమగా, స్నేహంగా మెలగాల్సిన అవసరం ఉందని, తద్వారా చెడు వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశాలు తగ్గుతాయన్నారు.
 
కార్యక్రమంలో, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలు పిల్లలకు అనుకూలమైన చట్టపరమైన సేవలు (చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్)పై అదనపు సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ యుగంధర్, అదేవిధంగా మాదకద్రవ్యాల అవగాహన వెల్నెస్ నావిగేషన్ పై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి సాయిసుధా వివరించారు. 
 
దివ్యాంగులకు ఉపయోగపడే వినికిడి పరికరాలు, ముగ్గురు లబ్ధిదారులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు అందజేశారు. 14 మంది ఎస్టీ లబ్ధిదారులకు గొర్రెల పెంపకం కోసం రూ.6.30 లక్షల చెక్కును అందించారు. అదేవిధంగా 20,670 మంది డ్వాక్రా సంఘాల సభ్యులకు స్త్రీ నిధి నుంచి రూ.143.94 కోట్ల జీవనోపాదుల రుణాల చెక్కును, 9,458 స్వయం సహాయక సంఘాలకు రూ.726.43 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును లబ్ధిదారులకు అందించారు.
 
కార్యక్రమంలో వివిధ పాఠశాలల చిన్నారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, అదేవిధంగా సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ కళాకారులు లఘు నాటిక ప్రదర్శన, జానపద గీతాలతో చైతన్యం కలిగించారు.
 
ఆకట్టుకున్న స్టాళ్లు..
ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ, డీఆర్వో కే చంద్రశేఖరరావు, ఇతర న్యాయమూర్తులతో కలిసి సందర్శించి తిలకించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత న్యాయ సేవలు, కృష్ణా జిల్లా పోలీస్ విభాగం వారి మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణకై అవగాహన ప్రదర్శన, అదేవిధంగా సైబర్ నేరాల డిజిటల్ అరెస్ట్ పై అవగాహన, ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల (సెర్ప్) ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన కలంకారి హ్యాండ్లూమ్స్, ఇతర ఉత్పత్తులు, మైనారిటీ విద్యార్ధులు, ముస్లిం కమ్యూనిటీల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరిస్తూ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ స్టాల్, ఉచిత వైద్య శిబిరం, మలేరియా డెంగ్యూ నివారణ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు అందిస్తున్న పథకాలు, సంక్షేమ వసతి గృహాలు, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ వివిధ ఉపకరణలు, అగ్నిమాపక సేవల శాఖ వారి అవగాహన ప్రదర్శన, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం వారి అంగన్వాడి ప్రీ స్కూల్ ప్రదర్శన, అదేవిధంగా బాల్యవివాహాల నిషేధంపై చిన్నారుల వేషధారణను అతిధులు ఆసక్తిగా తిలకించారు.
 
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, బీసీ కార్పొరేషన్ ఈడి రాజేంద్ర ప్రసాద్, సాంఘిక, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *