మచిలీపట్నం:
పవిత్ర క్రిస్మస్ పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం మచిలీపట్నం ఆర్కే కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్కే కళాశాల అధినేత బండి రామకృష్ణ మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ పండగ ద్వారా పరస్పర అభినందనలు తెలియజేసుకోవడం మంచి సంస్కృతి సంప్రదాయానికి నాంది అని అన్నారు. తమ కళాశాలలో గత 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సెమీ క్రిస్మస్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
ఎల్ ఇ ఎఫ్ చర్చ్ నిర్వాహకులు టీ ప్రభాకర్ మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగని నిన్ను వలె ఇతరులను ప్రేమించమని బైబిల్ సూక్తులు అందరూ పాటించాలని అన్నారు. ఆర్కే కళాశాల ద్వారా ఎందరో పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్న బండి రామకృష్ణ వంటి వ్యక్తులను ప్రోత్సహించాలని అన్నారు.
మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ సర్వ మతాల సారాంశం ఒకటేనని, మానవసేవే మాధవసేవ అని అన్నారు. విద్యార్థులు నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని అన్నారు.
విశ్రాంత ఎడిషనల్ఎస్పీ సాయన సుశీలరావు మాట్లాడుతూ యేసు బోధనలు మంచి మార్గానికి నాంది ప్రస్తావనని అన్నారు. సెమీ క్రిస్మస్ పండుగ ఒకరినొకరు కలుసుకోవడం, స్వీట్లు పంచుకోవడం, అభినందనలు తెలియజేసుకోవడం మరిచిపోలేని అనుభూతి అని అన్నారు.
బండి సత్యనారాయణ ప్రార్ధనతో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. సెమీ క్రిస్మస్ భారీ కేకును బండి రామకృష్ణ దంపతులు కట్ చేసి విద్యార్థినీ, విద్యార్థులకు పంపిణీ చేశారు. క్యాండిల్స్ తో సెమీ క్రిస్మస్ పాటలు పాడారు. విద్యార్థినీ విద్యార్థులు యేసు జననం తెలియజేస్తూ పాడిన పాటలు అందర్నీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో దైవ సేవకులు ఎం. ఏసు పాదం, జాన్ కెనడి, గౌరీ శంకర్, ప్రభాకర్ ప్రేమ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ డి. శివరామకృష్ణ హాజరయ్యారు.