పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా జగన్ తెలుసుకోవాలి
SSN
- December 19, 2025
- 1 min read
[addtoany]
– నేడు వాడుతున్న రోడ్లన్నీ పీపీపీ విధానంలో చేసినవే
– మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్
– అభివృద్ధిని అడ్డుకుంటామంటే సహించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్.
మచిలీపట్నం :
జనం గడ్డి పెట్టినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలువురి సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా నడచుకుంటే జగన్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టడం తధ్యమన్నారు. మెడికల్ కాలేజీల అభివృద్ధిపై వైసీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకప్పుడు పీపీపీ పద్దతిలో రోడ్లను అభివృద్ధి చేయడం వల్లనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సదుపాయం పెరిగింది. పరిశ్రమలు వచ్చాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. నాడు తీసుకున్న సంస్కరణల కారణంగానే ఇంత స్థాయిలో అభివృద్ధి జరిగింది. తర్వాత వచ్చిన పాలకులు అభివృద్ధిని కొనసాగించారు. కానీ నేడు జగన్ రెడ్డి వైఖరే విధ్వంసం. అధికారంలోకి వస్తే.. పీపీపీ పద్దతిలోక ఆస్పత్రుల అభివృద్ధికి ముందుకొచ్చిన కంపెనీల్ని తరుముతానని బెదిరించడం దుర్మార్గం. జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశక్తే లేదు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ.. పీపీపీ విధానాన్ని సమర్ధించింది. పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేసినప్పటికీ.. అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. ఆస్పత్రిని నిర్మించి, నిర్వహించే బాధ్యతలు ప్రైవేటుకు ఇస్తుంటే ఎందుకింత ఏడుపు.? మెడికల్ కాలేజీలను వీలైనంత త్వరగా పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో విద్యార్ధులకు సీట్లు పెరుగుతాయి. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇంత మేలు జరుగుతున్నందున వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దొంగ సంతకాలు పెట్టి గవర్నర్ గారికి లేఖలిచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తే ప్రైవేటుపరం ఎందుకు అవుతుందో జగన్ రెడ్డి బుర్ర పెట్టి ఆలోచించాలి. గత ఐదు సంవత్సరాలు బెదిరింపు ధోరణి కారణంగానే పెట్టుబడులు తరిమేసి, పారిశ్రామిక వేత్తల్ని తరిమేసి అవస్థలపాలు చేశారు. కానీ నేడు చంద్రబాబునాయుడి దూర దృష్టితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఆయన కార్యదక్షతకు నిదర్శనంగానే ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

