డిసెంబర్ 16వ తేదీని భారతదేశం ప్రతి సంవత్సరం విజయ్ దివస్(Vijay Diwas) గా జరుపుకుంటుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ఈ రోజును కేటాయించారు.
1971 డిసెంబర్ 3న ప్రారంభమైన యుద్ధం కేవలం 13 రోజుల్లోనే (డిసెంబర్ 16న) ముగిసింది. పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఎ.ఎ.కె. నియాజీ తన 93,000 మంది సైనికులతో కలిసి భారత సైన్యం (లెఫ్టినెంట్ జనరల్ జగ్‌జీత్ సింగ్ అరోరా) ముందు బేషరతుగా లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు ఇది. ఈ విజయంతో తూర్పు పాకిస్థాన్ విముక్తి పొంది, బంగ్లాదేశ్ అనే కొత్త స్వతంత్ర దేశంగా అవతరించింది.
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజున నివాళులు అర్పిస్తారు. న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (గతంలో ఇండియా గేట్ వద్ద) ప్రధానమంత్రి మరియు త్రివిధ దళాధిపతులు అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తారు.