ఈ నెల 20వ తేదీన పెడనలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఎ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం ఆయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా డిఎల్ఎస్ఎ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలనా యంత్రాంగం సహకారంతో ఈ నెల 20వ తేదీన పెడన మండలంలోని 216 జాతీయ రహదారి పక్కన ఉన్న పెడన ఫంక్షన్ హాల్లో నూతన తరహా న్యాయ సేవల శిబిరం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పలువురు న్యాయమూర్తులు పాల్గొంటారని తెలిపారు.
కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ఆయన వివరిస్తూ, సమాజంలో బాల్య వివాహాల నిషేధం, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి సాంఘిక దురాచారాలపై అవగాహనతోపాటు ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల సద్వినియోగంపై న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించటం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. దీనితోపాటుగా డిఎల్ఎస్ఎ ద్వారా సామాన్యుడికి ఉచిత న్యాయ సహాయం అందించే అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులు, సాంఘిక, గిరిజన, వికలాంగులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తదితర శాఖలు ప్రజలకు వారు అందిస్తున్న పథకాలు, సేవలను వివరిస్తూ ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సాంఘిక దురాచారాలపై సాంస్కృతిక లఘునాటికలు కూడా ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
సమావేశంలో జిల్లా ఇంచార్జ్ డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, కార్యక్రమ నోడల్ అధికారి డిఆర్డిఏ పీడీ హరిహరనాథ్, గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ శాఖ, ఐసిడిఎస్, గృహ నిర్మాణం, విద్య, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.