ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ నుండి విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీని సంయుక్త కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్తును పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.
గృహపకరణాలలో మూడు లేదా అంతకంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్న వస్తువులను వినియోగిస్తే 30% పైగా విద్యుత్తు పొదుపు అవుతుందన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారులు ఇంజన్లను ఆపివేసి ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు.
ఈ ర్యాలీలో పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.