ఆదివారం మచిలీపట్నం వలంద పాలెం లో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని రంగా కుమార్తె ఆశాకిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా సొంత ఊర్లు రెండు ఉన్నాయని ఒకటి విజయవాడ కాగా రెండవది మచిలీపట్నం అని అన్నారు. బందరు గడ్డ రంగా అడ్డా అని నినాదం చేశారు.
మచిలీపట్నంలో రంగా స్నేహితులు చిలంకుర్తి వీరస్వామి (అంబులు), పేర్ని కృష్ణమూర్తి, చిలంకుర్తి గంగయ్య తో మంచి స్నేహ సంబంధం ఉందని తెలిపారు. పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషిచేసిన ఏకైక నాయకుడు రంగా అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రంగా అభిమానులు ఉన్నారన్నారు.
అనంతరం ఆశాకిరణ్ నగరంలో మూడో డివిజన్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి, అలానే లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ నూతన విగ్రహావిష్కరణకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి అనేకమంది రంగా అభిమానులు, కుల సంఘ నాయకులు, మచిలీపట్నం డిప్యూటీ మేయర్ శీలం భారతి తదితరులు పాల్గొన్నారు.