MachilipatnamLocal News
March 15, 2026
జిల్లా

9వ తరగతి విద్యార్థులను 10వ తరగతికి సిద్ధం చేయాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • March 14, 2026
  • 0 min read
[addtoany]
9వ తరగతి విద్యార్థులను 10వ తరగతికి సిద్ధం చేయాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం: 
 
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను నిర్ధిష్ట ప్రణాళిక ప్రకారం 10వ తరగతికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంప్ కార్యాలయం నుండి విద్యాధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 9వ తరగతి విద్యార్థులను 2027 పదవ తరగతి పరీక్షలకు సంసిద్ధతపై మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2027 ఎస్ ఎస్ సి బోర్డు పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు 9వ తరగతి నుంచే 10వ తరగతి సిలబస్‌ పై దృష్టి పెట్టాలని సూచించారు. దీనికోసం ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతూ పలు సూచనలు చేశారు. 
 
విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా నిర్దిష్ట ప్రణాళికతో పదవ తరగతి పాఠ్యాంశాలను చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేవటం, రాత్రికి ముందుగానే నిద్రకు ఉపక్రమించటం ఆ మధ్యలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు చదువుకోవడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని అన్నారు. విద్యార్థులు చదివింది రాయటం, పునఃశ్చరణ చేసుకోవడం ద్వారా సబ్జెక్టు ఎక్కువగా గుర్తు ఉంటుందని చెప్పారు. ఏకాగ్రత కోసం ప్రాణాయాయాలు చేయాలని సూచించారు. క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అవసరం మేరకు ట్యూషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
 
తమ పిల్లలు ప్రతిరోజు నిద్రలేవటం, సమయానికి పడుకోవడం, తల్లిదండ్రులు అలవాటు చేయాలని, సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచే విధంగా చూడాలన్నారు. పిల్లలు చదువుకునేందుకు కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని వారి ముందే తల్లిదండ్రులు తగాదాలు, గొడవలు పడుతూ పిల్లల ప్రశాంతతకు భంగం కలిగించవద్దని, పరిస్థితులకు అనుగుణంగా వారిలో మనోధైర్యం నింపాలన్నారు. బాగా చదువుకునేందుకు పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని చెబుతూ వారి పోషకాహారం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.
 
పదవ తరగతి సిలబస్ ను నిర్ణీత సమయంలో పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, తద్వారా పునఃశ్చరణకు సమయం కేటాయించే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళిక చేయాలన్నారు.. తరచుగా స్లిప్ టెస్ట్ లు నిర్వహిస్తూ విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టే భరోసా, ధైర్యం ,ఆత్మవిశ్వం నింపాలని, ఆయా సబ్జెక్టుల్లో బలహీన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
 
పై అంశాలపై పూర్తి పర్యవేక్షణ ఉంచడం ద్వారా పదో తరగతి పరీక్షల్లో గొప్ప ఫలితాలు రాబట్టవచ్చని, అద్భుతాలు జరుగుతాయని చెబుతూ, విద్యార్థుల ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, అవసరం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులకు సూచించారు.
 
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *